28-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 28: లోక్‌సభ సమావేశాలు వాయిదాలతో మొదలయ్యాయి. నీట్‌పేపర్ లీక్‌పై చర్చించాలన్న విపక్షాల డిమాండ్ కారణంగా గందరగోళం మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సాధారణ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కాగానే నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షనేత రాహుల్ గాంధీ వాయిదా తీర్మానం ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్‌పై చర్చించాల్సి ఉందని, వారికి పార్లమెంట్ భరోసా ఇవ్వాల్సి ఉందని అన్నారు. అయితే నిబంధనల మేరకు రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ప్రారంభించాల్సి ఉన్నందున, అందులో ప్రస్తావించాలని స్పీకర్ ఓంబిర్లా సూచించారు. లేదా మరో తరహాలో చర్చకు అనుమతిస్తామని చెప్పారు. అయితే విపక్ష సభ్యులు అందుకు నిరాకరించారు. నీట్‌పై చర్చ చేయాల్సిందే నని పట్టుబట్టారు. నినాదలతో గందరగోళ పరిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ’నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో శుక్రవారం గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా.. ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి.
దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే విపక్షాలు నిబంధనలు కాదని డిమాండ్ చేయడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారా మంత్రి కిరణ్ రిజు అన్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ధన్యావా తీర్మానం అయిపోయాక చర్చకు అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే దీనిని విపక్షాలు అంగీకరించలేదు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం కన్పించింది. నీట్ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమ కొంతసేపు ఛైర్మన్ సభను నడిపించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది.
వారి నిరసనల నడుమే రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చను చేపట్టారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విూడియాతో మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ సమస్య.. దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశం. దానిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోదీ చేపట్టాలి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంట్ ఇవ్వాలని అన్నారు. 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. సోమ,మంగళ వారాలు సభలో కొత్త సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాలతో ముగిసాయి. బుధవారం స్పీకర్ ఎన్నిక జరిగింది. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.శుక్రవారం నుంచి సాధారణ సమావేశాలు మొదలయ్యాయి.