28-06-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూన్ 28: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పి.వి. చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.సంస్కరణలతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు దక్కుతుందని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా పి.వి. చేసిన సేవలు మరువరానివని పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి పి.వి. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదిలావుంటే పీవీ స్పూర్తితో దేశాభివృద్ధి కోసం పనిచేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, జైవీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి.
ఈ సందర్బంగా మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. దేశ అభ్యున్నతికి పీవీ సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. పీవీ నరసింహారావు కేబినెట్ లో కాకా కేంద్రమంత్రిగా దేశాభివృద్ధిలో భాగం అయ్యారని తెలిపారు. ఆ రోజుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేవారని..ఇపుడు స్పీకర్ ఓం బిర్లా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేలా స్పీకర్ చర్యలున్నాయన్నారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పార్లమెంట్ లో కొట్లాడుతామన్నారు ఎంపీ వంశీకృష్ణ. నీట్ పేపర్ లికేజ్ పై చర్చ చేపట్టాలంటూ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ చేస్తూ లోక్ సభ వెల్ లో ఆందోళనలు చేశామన్నారు.దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్న దశలో దేశానికి ఒక దిశను చూపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ తో కలిసి వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలను అమలు చేసి భారత్ ను ప్రపంచ దేశాల సరసన నిలిపారన్నారు. ఆయనతో పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టమన్నారు.