ad1
ad1
Card image cap
Tags  

  02-07-2024       RJ

ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో ఎన్‌డిఎ పాలన ఏర్పడింది

జాతీయం

  • గతమంతా కుంభకోణాలు.. అవినీతిమయం
  • దశాబ్దాలుగా బుజ్జగింపు రాజకీయాలు సాగించారు
  • ఈ పదేళ్లలో దేశం అన్నిరంగాల్లో దూసుకు పోతోంది
  • కోట్లాదిమందిని పేదరికం నుంచి బయటపడేశాం
  • వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం
  • రాహుల్‌ గాంధీవి పిల్ల చేష్టలు.. హిందువులను అవమానించారు
  • ఈ దేశం రాహుల్‌ను ఎప్పటికీ క్షమించదు
  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో ప్రధానిమోదీ
  • మోదీ ప్రసంగిస్తుండగా మణిపూర్‌ అంటూ నినాదాల హోరు

న్యూఢిల్లీ, జూలై 2: కాంగ్రెస్‌ పాలనలో కుంభకోణాలు, అవినీతి చర్యలు, దేశం పట్ల నిర్లక్ష్యం కారణంగా దేశం దివాళ తీసిందితప్ప మరోటి కానరాదని ప్రధాని మోడీ తూర్పారా బట్టారు. దేశంలో గతమంతా మిధ్య అని, ఈ పదేళ్లలోనే దేశం అన్ని రంగాల్లో దూసుకుని పోతోందని అన్నారు. దేశంలో కొన్ని దశాబ్దాల పాటు బుజ్జగింపు రాజకీయాలు కొనసాగాయి. దాంతో దేశం తీవ్రంగా నష్టపోయింది. 2014లో దేశం నిరాశ, నిస్పృహలో కూరుకుపోయింది. ప్రజలంతా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ప్రతి సామాన్యుడి నోట ఒకటే మాట వినబడేది.. ’ఈ దేశంలో మార్పు రాదా?’ అని..! అప్పుడు ఏ పేపర్‌ చూసినా కుంభకోణాల వార్తలే కన్పించేవి. గత ప్రభుత్వాల పాలనలో రూపాయిలో యాభై పైసలు అవినీతి జరిగేది. గతంలో గ్యాస్‌ కనెక్షన్ల కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది. రేషన్‌ బియ్యం దొరకడం కష్టంగా ఉండేది. వీటన్నిటితో ప్రజలు విసుగెత్తిపోయారు. మమ్మల్ని ఎన్నుకున్న తర్వాతే మార్పు మొదలైంది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని ప్రధాని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వరుసగా మూడోసారి తాము అధికారంలోకి రావడంతో కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్‌కు పరోక్షంగా చురకలంటించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. అయితే మోడీ ప్రసంగిస్తున్నంత సేపు విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ ఆటంకపరిచే యత్నాలు కొనసాగించారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీట్‌ పేపర్‌ లీకేజ్‌, మణిపుర్‌ అంశాలపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ గట్టిగట్టిగా నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించొద్దని అన్నారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. ప్రధాని మాట్లాడుతున్నంత సేపు ’మణిపుర్‌.. మణిపుర్‌’ అంటూ నినాదాలు చేశారు. వారి నిరసన మధ్యే ప్రధాని ప్రసంగాన్ని కొనసాగించారు.  అయినా మోడీ వారి నిరసనలు లెక్క చేయకుండా తాను చెప్పదల్చుకున్నది చెప్పారు. ఈ క్రమంలో విపక్ష నేత రాహుల్‌, అఖిలేశ్‌ యాదవ్‌లు చిద్విలాసంగా కనిపించారు. ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్ని అబద్దాలు చెప్పినా లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని.. వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీపై మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు. వరుసగా మూడుసార్లు ఆ పార్టీ 100 మార్క్‌ దాటలేదు. ఇన్నిసార్లు ఓడినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావట్లేదు. 99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్‌ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వందకు 99 సీట్లు రాలేదు. 543లో 99 వచ్చాయి. వారి స్టయ్రిక్‌ రేట్‌ 26శాతం మాత్రమే. ప్రజా తీర్పును వారు ఇకనైనా గౌరవించాలని మోదీ హితవు పలికారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు అభిప్రాయాలు చెప్పారు. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. పదేళ్లలో అవినీతిరహిత పాలన అందించాం. అది చూసే ప్రజలు మరోసారి మాకు అవకాశమిచ్చారు. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. భారత్‌ ప్రథమ్‌ అనే మా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఏ కార్యక్రమం చేపట్టినా భారత్‌ ప్రథమ్‌ కేంద్రంగానే తీసుకుంటున్నాం. మా పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు చేరాలనేదే మా విధానం అని ప్రధాని తెలిపారు.

2014కు ముందు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి దేశంలో ఎక్కడపడితే అక్కడ దాడులు చేసేవారు. మేం వచ్చాకే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాం. సర్జికల్‌ స్టైక్స్ర్‌ చేశాం. రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని చిందులేస్తున్న వారు.. జమ్ముకశ్మీర్‌లో దాన్ని అమలు చేయలేక.. అంబేడ్కర్‌ను అవమానించారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించాకే అక్కడ శాంతిభద్రతలు మెరుగయ్యాయి. అక్కడ రాళ్ల దాడులు తగ్గాయి. గతంలో దోషులు చట్టం నుంచి తప్పించుకునేవారు. 2014 తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసింది. మేం వచ్చాకే తుప్పుపట్టిన చట్టాలను రద్దు చేశామని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఇటీవల పలు రాష్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమి క్వీన్‌ స్వీప్‌ చేసింది. ఒడిశాలో జగన్నాథుడి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అనేక రాష్ట్రాలు భాజపా పాలనను కోరుకుంటున్నాయని మోదీ తెలిపారు. ఇకపోతే ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లక్ష్యంగా తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు. రాహుల్‌ గాంధీ సోమవారం లోక్‌ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మోదీ తీవ్రంగా స్పందించారు.

రాహుల్‌ గాంధీ చేసిన ఆ వ్యాఖ్యలు దేశ ప్రజలు చాలా ఏళ్ల వరకూ మర్చిపోబోరని.. హిందువులది హింసాత్మక వైఖరి అని రాహుల్‌ మాట్లాడడం ద్వారా ఆయన సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు. రాహుల్‌ గాంధీ మాట్లాడిన మాటలపై దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలని మోదీ పిలుపు ఇచ్చారు. హిందువులు ఎంత సంయమనస్కులో ప్రపంచానికి తెలుసన్నారు. ఆనాడు చికాగో సదస్సులో స్వామి వివేకానంద చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సభలో చిన్నపిల్లల చేష్టలు చూస్తున్నాం. రాహుల్‌ గాంధీ పిల్ల చేష్టలు చాలాసార్లు బయటపడ్డాయి. ఆయన కన్నుకొడతారు.. ఆలింగనం చేసుకుంటారు. సానుభూతి పొందేందుకు ఆడిన పిల్లాడి డ్రామాలు అందరూ చూశారు. రాహుల్‌ చెప్పేవి అన్నీ అబద్దాలు అని తేలిపోయాయి. సభా మర్యాదలను కూడా తగ్గించేలా వారు వ్యవహరించడం చూస్తున్నారు. రాహుల్‌ గాంధీ చెప్పినట్లుగా నిన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడ్డాయేమో అని అందరూ చూసుకున్నారు. ఆ పార్టీ చెప్పే అబద్దాలు కాంగ్రెస్‌ కు మరింత నష్టం కలిగిస్తాయని అన్నారు. దళిత, ఓబీసీ వ్యతిరేక వైఖరి వల్లే అంబేడ్కర్‌, నెహ్రూ కేబినెట్‌ నుంచి వైదొలిగారు. హిందువులది హింసాత్మక వైఖరి అంటారా? ఇదేనా విూ సంస్కారం.

హిందువులపై రాహుల్‌ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ ప్రజలు ఎన్నో ఏళ్ల వరకు మర్చిపోరు. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంస్కారం ఇదేనా? ఆయన మాటలు క్షమించరానివి. హిందువులపై నిందలు వేయడం ఫ్యాషన్‌ అయిపోయింది. దీన్ని సహించేది లేదు. హిందువులు అప్రమత్తంగా ఉండాలి. ఈశ్వరుడి రూపం దర్శనం కోసం.. సభలో ప్రదర్శన కోసం కాదు. ఇండి కూటమి నేతలు హిందూ ఉగ్రవాదం అంటూ ప్రచారం చేస్తున్నారు‘ అని మోదీ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్‌ భారత్‌ లక్ష్యాల గురించి మోడీ వివరించారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. పదేళ్లలో భారత్‌ ఖ్యాతి ఎంతో పెరిగిందని మోడీ అన్నారు. నేషన్‌ ఫస్ట్‌ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అవినీతి ఏ మాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం ప్రజల ఆశీర్వాదం కోరామని, దేశ ప్రజలు మాపై భరోసా ఉంచారన్నారు. రోణ రంగాన్ని ఆధునీకరిస్తున్నామని అన్నారు. అలాగే అన్నిరంగాల్లో పురోగతిని  సాధిస్తున్నామని అన్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. 

06, Jul 2024

సూరత్‌లో కుప్పకూలిన భవనం.. 15మందికి తీవ్ర గాయాలు

05, Jul 2024

ఢిల్లీలో బిజీబిజీగా సిఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

04, Jul 2024

రాష్ట్రానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోండి

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP