03-07-2024 RJ
జాతీయం
న్యూఢిల్లీ, జూలై 3: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో జులై 25వ తేదీ వరకు కవిత, మనీష్ సిసోడియా కస్టడీ పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఈడీ కేసులో బుధవారంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యూడిషిల్ కస్టడీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత, మనీష్ సిసోడియాను కోర్టు ముందు అధికారులు హాజరు పరిచారు. తదుపరి విచారణ జూలై 25వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా గత మూడు నెలల నుంచి కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రెండు రోజుల క్రితం తిరస్కరించిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఊరట ఇవ్వాలని, బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ బెయిల్‌ను ఇవ్వలేమని చెప్పింది.
హైకోర్టు బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందన్న ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి. అయితే కవిత.. ఈడీ, సీబీఐ కేసులకు సంబంధించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఈ నెల 1న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒక విద్యావంతురాలిగా పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ కేసులో కవిత పాత్రతో పాటు ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆధారంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలా.. వద్దా? అనే నిర్ణయ ముంటుందని వెల్లడించింది. ఈడీ సేకరించిన సాక్ష్యాలను బట్టి ఢిల్లీలో కొత్త మద్యం విధానం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని..ఈ కేసులో మరికొందరు నిందితులు కూడా ఆమె తరఫునే పనిచేశారని తేలిందని హైకోర్టు పేర్కొంది. ఫలితంగా ఆమెను ఓ నిస్సహాయ మహిళగా భావించలేమని కోర్టు స్పష్టం చేస్తూ ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది.