04-07-2024 RJ
జాతీయం
మనదేశంలో చట్టాలంటే భయం లేదు. శిక్షలు పడతాయన్న భీతి కూడా లేదు. తప్పులు చేసినా.. తప్పించు కోవచ్చన్న ధీమా ఉండడమే ఇందుకు కారణం. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు అందరిదీ ఇదే భావన. కోర్టుల్లో కేసులు వేయడం..ఏళ్లతరబడి వాయిదాలు వేయడం చూస్తున్నారు. ఏ కేసులో కూడా గట్టిగా శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. గడ్డి కుంభకోణంలో శిక్షపడ్డ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దర్జాగా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉంటూ ఐదేళ్లు సిఎంగా అధికారం వెలగబెట్టారు. ఎపిని అప్పుల ఊబిలోకి నెట్టి ఆర్థిక విధ్వంసం సృష్టించినా జంకూబొంకు లేకుండా రాజకీయ ఆలోచనల్లో జగన్ ఉన్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన కెసిఆర్, ఆయన పరివారం కూడా ఎదురుదాడి విమర్శలతో కాలం గడిపేస్తోంది. బ్యాంకులకు అప్పులు ఎగవేసి విదేశాలకు ఉడాయించిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తదితరులంతా హాయిగా జివించేస్తున్నారు. చిన్నాచితక కేసుల్లో ఉన్నవారు మాత్రమే జైలుకు వెళ్లడం, సచ్చీలతతో బయటకు రావడం జరుగుతోంది. ఇకపోతే ఇటీవల బీహార్‌లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. ఇప్పటి వరకు ఏడు వంతెనలు కూలాయని తెలుస్తోంది. ఈ ఘటనల తరవాత కూడా కాంట్రాక్టర్ల లో ఎక్కడా భయం కానరావడం లేదు.
కనీసం వారెవరో గుర్తించి అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలియడం లేదు. వంతెనలు కూలిన ఘటనల్లో అదృష్టం కొద్దీ ఎవరు కూడా గాయపడడం లేదా చావడం జరగలేదు. ఇకపోతే ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన అటల్ వంతెనకు పగుళ్లు రావడం, ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టర్మినల్ 1 విరిగిపడటం, అయోధ్యలో నీరు లీక్ కావడం, బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కుప్పకూలడం.. వంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వీటికి తోడు తాజాగా మరో ఘటన బయటపడిరది. దేశంలో రైళ్ల ప్రయాణ వేగాన్ని పెంచాలనే ఉద్దేశంతో తెచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లలో నీటి లీకేజీలు అవుతున్నాయి. ఓ రైలు కోచ్‌లోని రూఫ్ నుంచి నీరు కారగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొందరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మధ్య నడిస్తున్న వందే భారత్ రైలు నంబర్ 22416లోని ఒక కోచ్ పైకప్పు నుంచి నీరు కారింది. దీంతో సీట్లు తడిచిపోయి, ప్లోర్ అంతా నీరు నిండటంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. వందే భారత్ రైళ్ల తయారీలో నాణ్యత పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో ఘోర ఘటన జరిగింది. ఓదొంగ బాబా కారణంగా 121 మంది మృత్యువాత పడ్డారు.
ఇప్పుడా బాబా ఎక్కడున్నారో కూడా తెలియదు. హత్రాస్ జిల్లాలో నిర్వహించిన ఒక మతపరమైన కార్యక్రమం 121 మందికి పైగా అమాయకుల ప్రాణాలను బలిగొనడం దారుణం. సత్సంగ్ పేరిట జరిగిన ఈ కార్యక్రమం ముగింపు సందర్భంలో ’స్వయం ప్రకటిత దేవుడి’ పాదధూళి సేకరించడానికి భక్తులు పోటీ పడటంతో అనూహ్యంగా తొక్కిసలాట చోటుచేసుకుని ఈ దారుణానికి కారణం అయ్యింది. ఇంతమంది చనిపోయినా బాబాను పట్టుకోలేక పోయారు. ఈ ఘటన జరిగిన 24 గంటల తరువాత కూడా సంఘటన స్థలంలోనూ, ఆసుపత్రుల వద్ద హృదయవిదారక దృశ్యాలు కనపడుతున్నాయి. తొక్కిసలాట తరువాత అనేక మంది కనపడకుండా పోయారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మృతదేహాల్లో తమ ఆత్మీయుల కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. గాయ పడిన వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరగ వచ్చన్న వార్తలు కలవరాన్ని సృష్టిస్తున్నాయి. మరణించిన వారిలో దాదాపు అందరూ పేద, మధ్య తరగతి ప్రజలే కావడం గమనార్హం. నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్ల నుండి విముక్తి లభిస్తుందన్న ఆశతో ఇలాంటి సత్సంగ్ కార్యక్రమానికి హాజరైన వీరు ప్రాణాలను కోల్పోవాల్సిరావడం బాధాకరం.
ఇదంతా దొంగబాబాల కారణంగా జరుగుతున్నదే. ఇలాంటి బాబాలు మనదేశం నిండా వున్నారు. అమాయకత్వం పెట్టుబడిగా వీరంతా వ్యాపారాం చేస్తున్నా పసిగట్టడం లేదు. ఇంతటి విషాదానికి కారణమైన స్వయం ప్రకటిత దేవుడు సూరజ్ పాల్ అకా నారాయణ్ సాకర్ హరి అలియాస్ భోలే బాబా పేరును ఎఫ్‌ఐఆర్‌లో నిందితునిగా పేర్కొనలేదు. భోలే బాబాపై కనీస నిఘా పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. దీనిని అవకాశంగా తీసుకున్న ఆ ’స్వయం ప్రకటిత దేవుడు’ బుధవారం మధ్యాహ్నం నుండి అదృశ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం నుండి, బందోబస్తు ఏర్పాటు వరకు ప్రతిదీ అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. గతంలో పోలీస్ శాఖలో కొంతకాలం పనిచేసిన ఈ స్వయం ప్రకటిత దేవునికి లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లిన చరిత్ర కూడా ఉందని అంటున్నారు. కరోనా సమయంలో 50 మందితో సత్సంగ్ నిర్వహిస్తానని అనుమతి తీసుకుని 50 వేల మందితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించి వైరస్ వ్యాప్తికి కారణమైన ఘనత కూడా బాధ్యుడి అంటున్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. సామాన్య ప్రజానీకం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ... సత్సంగ్‌ల పేరుతో వంచన చేస్తున్న బాబాలను కట్టడి చేయాలి.
గతంలో ఆశారామ్ బాబా, డేరాబాబాల పాపాలను చూశాం. అయినా ఇంకా ఇలాంటి దొంగబాబాలను నమ్మడం సరికాదు. ప్రభుత్వాల తీరు ఇకనైనా మారాలి. దేవుడి పేరుతోనో, దెయ్యం పేరుతోనో సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి వ్యాపార సామ్రాజ్యాలు నిర్మిం చుకునే ఘరానా వ్యక్తులకు అంటకాగడం మానాలి. తక్షణం భోలే బాబాను అరెస్ట్ చేయాలి. బాధిత కుటుంబాల సభ్యులకు ప్రభుత్వం అండగా నిలవాలి. మూఢత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచ డానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. తనకు తాను భగవంతుడి ప్రతిరూపంగా ప్రచారం చేసుకుంటూ అమాయక జనం ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ’భోలే బాబా’ బాగోతానికి సంబంధించి అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నందున అతడిని వెదికి పట్టుకుని జైల్లోకి తోయాలి. తనను నమ్మే వారిని భోలే బాబా అనేక మూఢ నమ్మకాలతో ముంచేశాడని తెలుస్తున్నది. ముఖ్యంగా తాను నిర్వహించే సత్సంగ్‌లలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తుల సమస్యలు తీరిపోతాయనే ప్రచారం చేయించాడు. తన పాదధూళి కూడా పవిత్రమైనదని, బాబా నడిచిన నేలపై మట్టిని తాకినా అదృష్టం వరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించాడు.
ఇవి నమ్మి ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున జనం భోలే బాబా దర్శనం కోసం వచ్చే వారు. ఇలా వచ్చిన వారంతా మృత్యువాత పడడం మానవతప్పిదంగానే చూడాలి. ఇలా దేశంలో చట్టాలంటే భయం లేకుండా పోవడానికి శిక్షలు పడకపోవడమే కారణం. తప్పులు చేసిన వారికి కఠిన శిక్షలు వేసేలా మన చట్టాలు ఉండాలి. నిర్నీత కాలంలో విచారణ సాగాలి. అప్పుడే వంతెనలు కట్టేవారు నాణ్యత పాటిస్తారు. తప్పు చేయాలంటే జంకుతారు.